ఆర్టీసీ కార్మికులు ప్రజల పన్నుల నుంచి జీతాలు పొందుతూ ఎప్పుడు కూడా సక్రమంగా పనిచేయలేదని, పై పెచ్చు పండగపూట ప్రజలను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కెసిఆర్. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాదనలనే తెరాస అనుకూల హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, కార్మికులు అమీతుమీకి సిద్ధమయ్యాయి.
విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు.
విధుల్లోకి రాకపోతే ఉద్యోగులను తొలగిస్తానని కెసిఆర్ అనగానే, ఊరికే బెదిరిస్తున్నాడని అనుకున్నారు తప్ప నిజంగా తీసేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టుగానే దాదాపు 48వేలమందిని విధుల్లోంచి తొలిగిస్తున్నట్టు కెసిఆర్ ఆదివారం రాత్రి తెలిపారు.
ఇప్పటికే విపక్షాలన్నీ కెసిఆర్ కు వ్యతిరేకంగా ఏకమై కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే సమయంలో ఏదన్నా ఇతర కార్మిక సంఘం కూడా సంఘీభావం తెలుపుతూ సమ్మెకు దిగితే సమస్య మరింత జఠిలం అవుతుంది.
జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతంటే?
అత్యంత ప్రతిష్టాత్మకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముంచుకొస్తోంది. కేవలం రెండు వారాల్లోనే హుజూర్ నగర్ ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తెరాస శ్రేణులు ఎన్నికల వేళ ఈ కార్మికుల తొలగింపు నిర్ణయం తమకేమన్నా వ్యతిరేకంగా పనిచేస్తుందా అని కలవరపడుతున్నారు.
కానీ కెసిఆర్ మాత్రం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వారి వాదనలో నిజం లేకపోలేదు కూడా. కెసిఆర్ నిర్ణయం వెనుక కారణాలను మనం అంచనా వేయాలంటే ఒక మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలను మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది.
ప్రభుత్వోద్యోగులను అక్రమార్కులుగా సృష్టీకరించే ప్రయత్నాలు గత కొంత కాలంగా గట్టిగానే సాగుతున్నాయనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. తెరాస అధికార పత్రిక నమస్తే తెలంగాణ లో ధర్మ గంట పేరిట ప్రచురితమవుతున్న కాలమ్ ను గనుక పరిశీలిస్తే మనకు ఈ విషయం తేటతెల్లమవుతుంది.
ముఖ్యంగా రెవిన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారు లంచగొండులని, లంచాల కోసం అమాయక ప్రజలను పీక్కుతింటున్నారంటూ ఈ శీర్షిక కింద అనేక కథనాలు ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి కూడా. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వోద్యోగులంటే నెగటివ్ భావన కలుగుతుంది. తాము కట్టే పన్నులను జీతాలుగా పొందుతూ కూడా వారి విధిని సక్రమంగా నిర్వహించట్లేరనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళుతుంది.
ఇప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నిక సందర్భంగా కెసిఆర్ ఇలాంటి భావననే ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెరాస పార్టీ పట్ల సానుకూలతను సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రజల పన్నుల నుంచి జీతాలు పొందుతూ ఎప్పుడు కూడా సక్రమంగా పనిచేయలేదని, పై పెచ్చు పండగపూట ప్రజలను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కెసిఆర్. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాదనలనే తెరాస అనుకూల హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి.
హుజూర్ నగర్ ఓటర్లను కెసిఆర్ వాదన ఆకర్షిస్తుందా లేక ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదాలు కదిలిస్తాయో తెలియాలంటే అక్టోబర్ 24వ తేది వరకు ఆగాల్సిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 9, 2019, 9:12 PM IST