హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ తన ప్రచారానికి పోలీసులు ఆటంకం కలిస్తున్నారని.. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసుల తీరుపై మండిపడింది. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం చేసుకోవడం చట్టబద్ధమైన హక్కని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుని ప్రచారం చేసుకోవచ్చునని హైకోర్టు తేల్చి చెప్పింది.

పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల కమీషన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ప్రకారం..సమావేశాలు, ప్రచారానికి అవసరమైన అనుమతులను సంబంధిత అథారిటీల నుంచి పొందాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రచారానికి తీన్మాన్ మల్లన్న ముందస్తు అనుమతి తీసుకోలేదని... అనుమతి తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల నియమావళి ప్రకారం వ్యవహరించాలని, సరైన అనుమతులు తీసుకుని ప్రచారం చేసుకోవాలని పిటిషన్‌కు సూచించింది. అలాగే అనుమతులు ఉంటే ప్రచారం విషయంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికను మరింత రసవత్తరం చేస్తూ తీన్ మార్ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయిన తీన్ మార్ మల్లన్న ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో నిలవనున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిన్న అర్థరాత్రి ప్రకటించాడు.

తాను బడుగు బలహీన వర్గానికి చెందిన వాడినని, ఉప ఎన్నికలో గెలిచేంత ఆర్ధిక స్థోమత తనకు లేని కారణంగా ప్రజల నుంచి విరాళాలు అడుగుతున్నానన్నాడు.. 

తీన్ మార్ మల్లన్న గా సుప్రసిద్ధుడైన ఇతని పేరు నవీన్ కుమార్. తొలుత తీన్ మార్ అనే కార్యక్రమాన్ని టీవిలో నిర్వహించేవాడు. ఆలా బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ, యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడు.

డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాల వీడియోలే పెట్టాడు. బాతాలా పోశెట్టి పేరిట ఒక యూట్యూబ్ సిరీస్ నే స్టార్ట్ చేసాడు. 

ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు తనకు ప్రజలు సహకరించాలని వేడుకుంటున్నాడు. అందరినీ కనీసం వారుతాగే ఒక ఛాయ్ పైసలనన్నా విరాళంగా ఇవ్వాలని తనకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ ను యూట్యూబ్ లో ఉంచాడు. ప్రచారానికి కూడా ప్రజలను తరలిరావాలని వేడుకుంటున్నాడు. 

నిన్న అర్థరాత్రి పోస్టు చేసినప్పటికీ, ప్రజలు భారీ స్థాయిలో దీనిని చూసారు. ఉదయం 7గంటలకల్లా 32వేలమంది చూశారంటే ఇతనికి ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టు.

ప్రతిపక్షాలు తాను బయటపెడుతున్న ప్రభుత్వ భూకుంభకోణాలపై మాట్లాడకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నాయని, అందుకే తానుకూడా ప్రజాక్షేత్రంలోనే అధికార,ప్రతిపక్షాల భారతం పడతానని వేడుకుంటున్నాడు. గతంలో ఇతను కాంగ్రెస్ టికెట్ పై విద్యావంతుల ఎమ్మెల్సీ గా పోటీ చేసి ఓటమి చెందాడు. 

ప్రజలందించే ఒక్క రూపాయి కూడా వృధా చేయనని, తెలంగాణ ప్రజలిచ్చే  ప్రతిరూపాయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఖర్చు చేస్తానని తెలుపుతున్నారు. 

కేవలం మూడు పార్టీలమధ్య మూడు ముక్కలాటగా ఉంటుందనుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు లాయర్లు, సర్పంచులు, ఈ నూతన ఎంట్రీ తీన్ మార్ మల్లన్న వంటి వారితో చాలా రసవత్తరంగా మారింది.