కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్: టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి, ఇటీవలే కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న ఆయన త్వరలో పెద్దిరెడ్డిని చేర్చుకోనున్నారు.
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు హుజూరాబాద్ ఆపరేషన్ చేపట్టారు. మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు బహుముఖ వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. దళిత బంధు వంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఇతర పార్టీల నాయకులకు గాలం వేస్తున్నారు.
ఇందులో భాగంగా బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీన పెద్దిరెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి స్వయంగా చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ తనను ఆహ్వానించారని, ఈ నెల 30వ తేదీన తాను టీఆర్ఎస్ లో చేరుతానని ఆయన చెప్పారు. తాను పదవులు ఆశించి టీఆర్ఎస్ లో చేరడం లేదని, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించడానికి తాను వారధిలా ఉంటానని ఆయన చెప్పారు. దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించడం సంతోషమని ఆయన అన్నారు. వెళ్లిపోతూ తాను బిజెపిని విమర్శించదలుచుకోలేదని ఆయన చెప్పారు. బిజెపిలోని వ్యవస్థ తనకు నచ్చలేదని, అందుకే బయటకు వచ్చానని ఆయన చెప్పారు.
కాగా, ఇటీవల కాంగ్రెసుకు రాజీనామా చేసిన హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డిని కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సాధారణ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు జారిపోకుండా జాగ్రత్త పడుతూనే కేసీఆర్ ఇతర పార్టీల నాయకులను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు.