ఖమ్మంలో దారుణం జరిగింది. భార్యను చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మోతెనగర్‌కు చెందిన దంపతులు నాగేశ్వరరావు, నవ్యల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పిల్లలను తీసుకుని భార్య నవ్య వెళ్లిపోతోంటే.. ఆమెపై రోడ్డుపైనే విరుచుకుపడ్డాడు భర్త నాగేశ్వరరావు. రోడ్డుపై నుంచి పక్కనే వున్న పొదల్లోకి లాక్కెళ్లి.. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.

దీంతో అప్రమత్తమైన స్థానికులు నాగేశ్వరరావుపై రాళ్లతో దాడి చేసి అతని బారి నుంచి ఆమెను విడిపించారు. గాయపడ్డ బాధితురాల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.