కడదాకా తోడుంటానని ప్రమాణం చేశాడు. మూడుముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. తన జీవితం ఆనందంగా సాగిపోతుందని ఆమె సంబరపడేలోగా... జీవితాన్ని ముగించేశాడు. కనీసం కడుపుతో ఉందనే కనికరం కూడా లేకుండా భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మెదక్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాములు–యాదవ్వ దంపతుల కుమార్తె అంజలిని(మహేశ్వరి)(23) హవేళిఘణాపూర్‌ మండలం సర్దన గ్రామానికి చెందిన అభిలాష్‌కు ఇచ్చి 2018 ఏప్రిల్‌లో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొంతకాలం సాఫీగా సాగిన సంసారంలో చిన్నపాటి కలహాలు మొదలయ్యాయి.

అప్పటికే భర్త కోరినట్లు బైక్, రూ.50వేల నగదు.. తన పుట్టింటి నుంచి అడిగి తీసుకువచ్చి ఇచ్చింది. ఆ తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మూడుసార్లు దంపతులు ఇద్దరూ పంచాయతీకి కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే అంజలి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి.

ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అంజలిని స్నేహితుడి వివాహం ఉందంటూ భర్త అభిలాష్‌ సోమవారం మధ్యాహ్నం సర్దన గ్రామానికి తీసుకువెళ్లాడు.  అక్కడ భార్యభర్తల మధ్య మరోసారి డబ్బు విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కోపోద్రేక్తుడైన అభిలాష్‌ తన భార్య అంజలిని గొంతునులిమి హతమార్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 

స్థానికుల సహకారంతో సమాచారం అందుకున్న వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంజలి మృతి చెందిన విషయాన్ని అత్తమామలకు సమాచారమిచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి కుటుంబీకులతో కలిసి పరారయ్యాడు. కాగా.. తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలంటూ అంజలి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.