నీలిచిత్రాల్లో చేసినట్లు తనతో లైంగిక చర్య చేయాలంటూ మైనర్ భార్యపై చిత్రహింసలకు పాల్పడ్డ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన 30 ఏళ్ల ఆకుల సృజన్‌.. హైదరాబాద్ బడిచౌడీ కూరగాయల మార్కెట్‌లో నివసిస్తున్న 17 ఏళ్ల బాలికను గతేడాది ఆగస్టులో శ్రీనగర్‌లోని ఓ ట్రస్ట్‌లో వివాహం చేసుకున్నాడు.

అయితే సృజన్‌కు నీలిచిత్రాలు చూసే అలవాటు ఉండటంతో భార్య దగ్గర వాటిని తిలకించేవాడు. అక్కడితో ఆగకుండా వాటిలో ఉన్నట్లు తనతో శృంగారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. ప్రతి రోజూ ఆమెను లైంగికంగా వేధిస్తూ హింసించేవాడు.

దీనికి ఎదురుతిరిగితే వేడినీళ్లు పోసి నానా హింసలకు దిగేవాడు.. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భాల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుని ఆనందించేవాడు. రోజు రోజుకి అతని వికృత చేష్టలు పెరిగిపోవడంతో ఐదు నెలల క్రితం భర్త దగ్గరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద ఉంటోంది.

సృజన్ తన భార్యను తీసుకెళ్లడానికి రావడంతో తాను వెళ్లనంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తెలిసి తెలియని వయసులో తనను పెళ్లిచేసుకోవడంతో పాటు లైంగికంగా వేధిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించింది.

అయినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని కలిసింది. కమీషన్ ప్రతినిధి సరస్వతి బాలికను తీసుకుని సమస్యను సుల్తాన్‌బజార్ ఏసీపీ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ఏసీపీ సృజన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో భర్త, కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.