డబ్బుల కోసం కట్టుకున్న ఓ వ్యక్తి ఏ భర్తా చేయని నీచానికి పాల్పడ్డాడు. భార్యను మోసం చేసి కోటి రూపాయలు కొట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సంతోష్ అనే ఓ వ్యక్తి జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన భార్యకు వేరే పేరుతో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్నాడు.

ప్రతిరోజూ ఛాటింగ్ చేయడంతో సంతోష్ భార్య అతనికి క్లోజ్‌గా మారింది. నెమ్మదిగా అశ్లీల వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం మొదలెట్టాడు. ఇది గమనించిన బాధితురాలు.. అతనిని బ్లాక్ చేసింది.

ఇదే అవకాశంగా తీసుకున్న సంతోష్ మరింత వేధింపులకు గురిచేశాడు. ఎట్టకేలకు ఆమె నుంచి కోటి రూపాయలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా మరో కోటి రూపాయలు పంపించాలని, లేదంటే ఫోటోలను మార్ఫింగ్ చేసి మీ కుటుంబసభ్యులకు పంపిస్తానని  బెదిరించడం మొదలుపెట్టాడు.

అంతేకాకుండా తనతో ప్రతిరోజూ ఛచాటింగ్ చేసిన విషయం నీ భర్తకు చెబుతానంటూ బ్లాక్ బెయిల్ చేశాడు. ఈ క్రమంలో ఆమెకు భర్త సంతోష్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో నేరుగా రంగంలోకి దిగిన పోలీసులు తమదైన తరహాలో ప్రశ్నిస్తే అసలు నేరం ఒప్పుకున్నాడు. సంతోష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు గతంలోనూ కొంతమంది మహిళల పట్ల ఇదే తరహాలో మోసం చేసినట్లు సమాచారం.