రైతులకు పెట్టుబడి ఖర్చుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఆ డబ్బుల విషయంలో భార్య, భర్తల మధ్య వివాదం నెలకొని.. చివరకు ఒకరు ఆత్మహత్య చేసుకునే దాకా దారితీసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం బోంగ్రగాం గ్రామ పంచాయితీ బీంజీ తండాకు చెందిన రైతు చౌహాన్(43) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి రైతు బంధు పథకం కింద ఆయన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి.

ఆ డబ్బుల కోసం బ్యాంక్ కి వెళ్లిన చౌహాన్.. వాటిని డ్రా చేసి వెంటనే ఖర్చు చేశాడు. ఆ డబ్బులను పంట పొలానికి కాకుండా జల్సాలకు ఖర్చు చేయడాన్ని భార్య సహించలేకపోయింది. వెంటనే ఈ విషయంలో భర్త చౌహాన్ ని కాస్త గట్టిగా మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన చౌహాన్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.