హైద్రాబాద్ టెక్కీకి కరోనాను ఇలా నయం చేశారు
విదేశాల నుండి హైద్రాబాద్ కు వచ్చిన సికింద్రాబాద్ కు చెందిన టెక్కీకి వైద్యులు కరోనాను నివారించారు
హైదరాబాద్: విదేశాల నుండి హైద్రాబాద్ కు వచ్చిన సికింద్రాబాద్ కు చెందిన టెక్కీకి వైద్యులు కరోనాను నివారించారు. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి అతడికి ఈ వ్యాధి పూర్తిగా నయమైనట్టుగా నిర్ధారించిన తర్వాత ఇంటికి పంపారు. ఈ వ్యాధికి ఎలాంటి మందులు లేనప్పటికీ అందుబాటులో ఉన్న మందుల ద్వారానే బాధితుడికి నయం చేసినట్టుగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
కరోనా వ్యాధికి ఇప్పటి వరకు మందులు లేవు. ఈ వ్యాధి నివారణ కోసం మందులు తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. క్లినికల్ ట్రయల్స్ కూడ ప్రారంభమయ్యాయి.
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే ఓ వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా దుబాయ్ కు వెళ్లాడు. దుబాయ్ నుండి బెంగుళూరు మీదుగా ఆయన హైద్రాబాద్ కు వచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ఈ నెల 3వ తేదీన గుర్తించారు.
దీంతో అతడిని గాంధీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స నిర్వహించారు. జనరల్ ఫిజిషీయన్, పల్మనాలజిస్ట్, జనరల్ మెడిసిన్, సైకాలజిస్టులతో కూడిన బృందం టెక్కీ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించిన మీదట ఒక అంచనాకు వచ్చారు.
కరోనా వ్యాధి లక్షణాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం,జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులను తగ్గించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్యుల బృందం చికిత్స ఇవ్వడం ప్రారంభించారు.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్న కారణంగా ఆక్సిజన్ అందిస్తూనే అతడికి చికిత్స అందించారు. రెండు మూడు గంటలకోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
కరోనా వ్యాధి సోకిందని తేలడంతో బాధితుడికి సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. క్రమం తప్పకుండా చికిత్స అందించిన కారణంగా టెక్కీకి నయమైనట్టుగా వైద్యులు గుర్తించారు. బాధితుడి శాంపిల్స్ ను పూణెకు పంపడంతో కరోనా లక్షణాలు లేనట్టుగా గుర్తించారు. దీంతో ఈ నెల 14వ తేదీన యువకుడిని ఇంటికి పంపారు.