హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ ప్రబలకుండా నియమ నింబంధనలు పాటించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా కూడా కొందరు ఖాతరు చేయడం లేదు. కాగా.. తాజా పరిశోధన ప్రకారం.. టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ తయారీ, హోటళ్లతోపాటు టీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని తెలుస్తోంది.

హోటళ్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను తయారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుంపర్ల ద్వారా కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికులు మాస్క్‌లు ధరించడం లేదు.

పట్టణంలో టిఫిన్‌ సెంటర్లతో పాటు ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న కార్యాలయాల్లో ఆరంభంలో హడావిడి చేసిన అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. గతంలో మాస్కులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న కొందరికి జరిమానా వేశారు. 

పట్టణంలో కోవిడ్‌ వ్యాప్తి చెందకముందు చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం మూడు కోవిడ్‌ కేసులు నిర్ధారణ అయినా దృష్టిసారించడం లేదు. పట్టణంలో కోవిడ్‌ నియంత్రణ కోసం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.