హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ విలీనంపై రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీని విలీనం చేసిన నేపథ్యంలో పార్టీ మారిన10మంది ఎమ్మెల్యేలతోపాటు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్ లకు నోటీసులు జారీ చేసింది. 

టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి సంబంధించి గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కోర్టును ఆశ్రయించారు. అలాగే శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో షబ్బీర్ అలీ సైతం హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ రెండు పిటీషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది వాదనలు, టీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, శాసనమండలి చైర్మన్, శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల కమిషన్ లకు నోటీసులు జారీ చేసింది. 

అలాగే టీఆర్ఎస్ పార్టీలో సీఎల్పీ విలీనానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్ లతోపాటు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయలేదు. ఎందుకంటే ఇటీవలే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. 

ఇకపోతే సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క వేసిన పిటీషన్ పై బుధవారం వాదనలు వినిపించనున్నాయి. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ మల్లుభట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో అటు శాసనమండలిలో సీఎల్పీ విలీనం, అసెంబ్లీలో సీఎల్పీ విలీనంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పిటీషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠ నెలకొంది. మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది.