బర్త్ సర్టిఫికేట్‌లో ‘‘నో కాస్ట్’’, ‘‘నో రిలీజియన్’’ కాలమ్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జనన ధ్రువీకరణ కోసం చేసే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారి వీలుగా ఓ కాలమ్‌ను చేర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత.. పాఠశాల విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు.

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జనన ధ్రువీకరణ కోసం చేసే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారి వీలుగా ఓ కాలమ్‌ను చేర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత.. పాఠశాల విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. జనన ధృవీకరణ పత్రంలో తమ పిల్లల మతం, కులాన్ని పేర్కొనకుండా తమ అభ్యర్థనను గుర్తించేలా ప్రతివాద అధికారులకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ సందెపు స్వరూప, మరొక వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. బర్త్, స్కూల్ సర్టిఫికేట్‌లలో “No caste”, “No religion” కాలమ్ చేర్చాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్‌కు చెందిన స్వరూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే 2019 మార్చి 23న జన్మించిన తమ కొడుకు ‘ఇవాన్ రూడే’ బర్త్ సర్టిఫికెట్ కోసం స్వరూప, డేవిడ్ దంపతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు (బాబూ జన్మించిన ప్రాంతం). జనన నమోదు ఫారం లోని కుటుంబ ‘మతం’ అనే కలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని సదరు అధికారులు చెప్పడంతో.. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వీళ్ళు మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్ నింపడానికి నిరాకరించారు. ఆ కాలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు జిల్లా అధికారులను ఆశ్రయించారు. తాము కోరిన పద్ధతుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేశారు.
గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిల తో కూడిన ధర్మాసనం వీళ్ళ డిమాండ్ పైన కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ జనన మరణ ధ్రువీకరణ అధికారులకు (రిజిస్ట్రర్ ఆఫ్ సైన్సెస్), రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల గడువు విధించింది. అయితే సంవత్సరాలు గడుస్తున్న ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయకపోగా.. మరింత సమయాన్ని కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు.
ఇక, 5 సంవత్సరాల లోపు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రభుత్వ నియమాలు ఉన్న నేపథ్యంలో, బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్టు ఇవ్వకపోవడం అలాగే స్కూల్లో చేర్చుకోవడానికి విద్యాసంస్థలు నిరాకరించడంతో అత్యవసరంగా తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎస్ వెంకన్న, డి సురేష్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఎట్టకేలకు తీర్పువెలువరించింది.
ఇక, తాము కోరినట్లుగా జస్టిస్ లలిత కన్నెగంటిగారు తీర్పు ఇవ్వడం పట్ల డేవిడ్, రూప దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో కుల,మతాలకు అతీతంగా జీవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారని, వీటికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాట చరిత్ర కూడా ఉందని, మతాన్ని, కులాన్ని వదులు కుంటామని ఎవరైనా ముందుకు వస్తే వ్యక్తిగత స్థాయిల్లో ఏదో సర్దుబాటు చేస్తూ పరిష్కారం చూపుతున్నారే తప్ప చట్టం చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న తరుణంలో శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు.