వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును కోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. 

ఈ కేసులో కౌంటరు దాఖలుకు నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు కోరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని అదనపు ఏజీ తన వాదనలు వినిపించారు. 

హైకోర్టు ప్రారంభమయ్యాక, భౌతిక విచారణ చేపట్టాలని చెన్నమనేని రమేష్ కోరారు. అయితే దీనిమీద వారం రోజుల్లో విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే కోర్టు అడిగిన అన్ని రికార్డులు సమర్పించామన్న ఏఎస్ జీ తెలిపారు. 

చెన్నమనేని పౌరసత్వం మీద వీలైనంత త్వరగా తేల్చాలని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కోరారు. అంతేకాదు ఓ జర్మనీ పౌరుడు భారతదేశంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని శ్రీనివాస్ న్యాయవాది రవికిరణ్ కోర్టుకు తెలిపారు. 

ఈ వాదనలు విన్న కోర్టు విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.  తుది వాదనలకు అందరూ సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటేనే వాదనలు  వింటానని న్యాయమూర్తి తెలిపారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి తాము అప్పియర్ అవుతామని కోర్టుకు అడిషనల్ అడ్వొకేట్ జెనరల్  తెలిపారు. దీనిమీద  అఫిడవిట్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

ఇదిలా ఉంటే చెన్నమనేని అఫిడవిట్ ను జర్మనీ ధ్రువీకరించినట్లు అధికారిక సమాచారం తెలిసింది. చెన్నమనేని రమేష్ పాత పాస్పోర్ట్ ఉపయోగించవచ్చని, అయితే ఆయనకు జర్మనీ పౌరసత్వం లేదని జర్మని రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. 

ఈ మేరకు జర్మనీ పౌరసత్వం ఒదులుకున్న ధ్రువీకరణ పత్రాన్ని చెన్నమనేని రమేష్ కోర్టుకు సమర్పించారు.  అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్వంధ పౌరసత్వం ఆరోపణలను నిరూపించాలని, దీనికి తగిన ఆధారాలు జర్మనీ నుంచి తేవాలన్న హైకోర్టు ఆదేశాలను కేంద్ర హోంశాఖ నెరవేర్చలేకపోయింది. 

ఈ రోజు హైకోర్టులో జరిగిన చర్చలో జర్మని అధికారిక సమాచారం ప్రకారం చెన్నమనేని డిసెంబరు 15, 2020 నాడు దాఖలు చేసిన అఫిడవిట్ ను ధ్రువీకరిస్తున్నదన్న అభిప్రాయం వెల్లడయ్యింది. హోం శాఖ చెన్నమనేని ద్వంద పౌరసత్వం గురించి జర్మని రాయబార కార్యాలయన్ని సంప్రదించినప్పుడు పాత పాస్పోర్టు ఉపయోగించిన మాత్రాన చెన్నమనేని జర్మని పౌరుడు కాడని వారు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని హోంశాఖ తన అఫిడవిట్ లో జనవరి 22, 2021 నాడు హైకోర్టుకు తెలిపింది.

పౌరసత్వ చట్టం సెక్షన్ 5 ప్రకారం చెన్నమనేని తను భారత పౌరసత్వం పొందిన సమాచారాన్ని 3-3-2009 నాడు సంబందిత జర్మని అధికారిక సంస్థకు తెలిపిన పత్రంతో పాటు వారు దాన్ని 13-2-2020 నాడు మరోసారి ధ్రువీకరిస్తున్న పత్రాన్ని 15-12-2020 నాడు అఫిడవిట్ రూపం లొ హైకోర్టుకు సమర్పించారు. 

1993లో చెన్నమనేని స్వచ్చందంగా జర్మని పౌరసత్వం తీసుకున్నప్పుడు భారత పౌరసత్వం ఎలాగైతే కోల్పోయారో, అలాగే 2009లో మళ్లీ స్వచ్చందంగా భారత పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయారు. ఇది రెండు దేశాల్లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే జరిగింది.