హైదరాబాద్:  సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని  సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

సీఎల్పీలో టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని  నిరసిస్తూ రెండు రోజుల క్రితం  కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  కోరుతూ కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు.

రెండు పిటిషన్లను కలిపి ఒకేసారి విచారణ చేయనున్నట్టు హైకోర్టు మంగళవారం నాడు తేల్చి చెప్పింది. బుధవారం నాడు  ఈ పిటిషన్లను కలిపి విచారణ చేయనుంది హైకోర్టు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేస్తున్నట్టుగా వారం రోజుల క్రితం స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. 

రాజ్యాంగానికి విరుద్దంగా సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క  ఇందిరా పార్క్ వద్ద దీక్షకు కూడ దిగిన విషయం తెలిసిందే.