తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నెల 21న ఈ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కొందరు మావోలు ప్రాజెక్ట్ పరిసరాల్లో సంచరిస్తున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాళేశ్వరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గ్రేహౌండ్స్‌తో పాటు స్పెషల్ ఫోర్స్‌ను ప్రాజెక్ట్ వద్ద మోహరించారు.

వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులు డేగ కన్నుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్ద పహారా కాస్తున్నారు.