హైదరాబాద్: కూకట్ పల్లి ప్రజాఫ్రంట్ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా సోదరుడు తారకరత్న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూకట్ పల్లి  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తారకరత్న సుహాసినికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 

తన సోదరి సుహాసినిని గెలిపించాలని తారకరత్న ప్రజలకు పిలుపునిచ్చారు. తన తాత దివంగత ఎన్టీఆర్, పెదనాన్న నందమూరి హరికృష్ణలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారని గుర్తు చేశారు. తన సోదరి సుహాసినిని గెలిపిస్తే కూకట్ పల్లి ప్రజలకు మరింత సేవ చేస్తుందని చెప్పారు. 

ప్రజాసేవ చేసేందుకు నందమూరి వంశం నుంచి వస్తున్న తన ఆడపడుచును మీ ఆడపడుచుగా భావించి గెలిపించాలని తారకరత్న కోరారు. సుహాసినికి రాజకీయాలంటే ఇష్టమని నిత్యం ప్రజలకు సేవ చెయ్యాలనే ఆలోచనతో ఉంటుందని తెలిపారు. 

తన అక్కకు అవకాశం ఇస్తే కూకట్ పల్లి ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడుతుందన్నారు. మరోవైపు నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీమంత్రి పరిటాల సునీత సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో సుహాసిని గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 

మెుత్తానికి సుహాసినికి మద్దతుగా తన సోదరుడు తారకరత్న, మంత్రి పరిటాల సునీతలు ప్రచారం చెయ్యడంతో సుహాసిని వర్గం తెగ సంబరపడిపోతుంది. వీరితోపాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణలు సైతం ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. వీరి పర్యటనలు తన గెలుపుకు ఎంతో దోహదం చేస్తాయని ఆమె భావిస్తున్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే