Asianet News TeluguAsianet News Telugu

దొంగ స్వామిజీ.. తర్వాతి ప్రధాని నేనే..

ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.3కోట్లు ఖర్చు చేసి దివ్య అనే యువతిని వివాహం కూడా చేసుకున్నాడు.ఈ సంపాదన సరిపోలేదంటూ డ్రిమ్‌ బ్రిడ్జ్‌ సోషల్‌ ట్రేడ్‌, గిరీశ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ, ఎయిర్‌ లైన్‌ గోల్డ్‌, అండ్‌ డైమండ్‌ బిజినెస్‌ ఇలా 30 స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. 

held spiritual guru advita kriya girish for cheating people
Author
Hyderabad, First Published Dec 25, 2018, 11:30 AM IST

మనదేశంలో రోజుకో దొంగ స్వామిజీలు పుట్టుకువస్తుంటారు. వారంతా స్వామిజీ వేషం వేసుకొని.. అమాయక ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుతుంటారు. తాజాగా.. మరో దొంగ బాబా గుట్టు బయటపడింది. అమాయక ప్రజలకు మాయమాటలు  చెప్పి.. దాదాపు రూ.60కోట్లు దోచేశాడు.  చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. కాగా.. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడటంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు.

అమెరికాకు బిల్ గేట్స్ ఉన్నాడు...జపాన్‌కు తడాషి యానాయి....చైనాకు జాక్ మా... వీరంతా ఆయా దేశాల్లో శ్రీమంతులు... వారిలాగా తాను కూడా ఇండియాలో శ్రీమంతుడిగా ప్రచారం చేసుకున్నాడు. అతనే ఐద్వెత ప్రక్రియ గిరీశ్. ఇంటర్ ఫెయిల్ అయిన ఈ గిరీశ్... ఇప్పుడు తాను ఇండియాలో అత్యంత శ్రీమంతుడిగా పోల్చుకున్నాడు. ప్రపంచ శ్రీమంతుల ఫొటోలతో ప్రచారం చేసుకున్నాడు... ఇది నిజమేనని దాదాపు వెయ్యిమంది అతని వద్ద రూ.60 కోట్లను పెట్టుబడిపెట్టి లాభాల కోసం ఎదురుచూస్తున్నారు... ఈ లోపే అతని భాగోతం బయటపడింది.

held spiritual guru advita kriya girish for cheating people

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన గిరీశ్ సింగ్ చదివింది కేవలం ఇంటర్. అతనికి పురాణాలు, కథల పట్ల అవగాహన చిన్నప్పటి నుంచే ఉంది. వాటిని అవకాశంగా తీసుకొని.. తాను దేవీ పుత్రుడునని.. తాను ఏది చెబితే అది జరుగుతుందని ప్రజలను నమ్మించాడు. 2024లో దేశ ప్రధాని కూడా తానే అవుతానని చెప్పడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో మకాం ఏర్పాటు చేసుకొని.. కొద్ది రోజుల్లో ఆధ్మాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందాడు.

అనంతరం తన దగ్గరకు వచ్చే భక్తుల సమస్యలను బట్టి కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధన్వంతరీ ప్రక్రియ, కళ్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియ పేర్లతో క్లాసులు తీసుకునేవాడు. ఒక్కో క్లాసుకి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసేవాడు. ఇలా కోట్లు ఆర్జించాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.3కోట్లు ఖర్చు చేసి దివ్య అనే యువతిని వివాహం కూడా చేసుకున్నాడు.

ఈ సంపాదన సరిపోలేదంటూ డ్రిమ్‌ బ్రిడ్జ్‌ సోషల్‌ ట్రేడ్‌, గిరీశ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ, ఎయిర్‌ లైన్‌ గోల్డ్‌, అండ్‌ డైమండ్‌ బిజినెస్‌ ఇలా 30 స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డైరెక్టర్లుగా తన భార్య దివ్యను, తమ్ముడిని నియమించాడు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 3 నుంచి 6నెలల్లోనే కోటీశ్వరులు కావొచ్చంటూ నమ్మించాడు. 

తన వద్ద రూ. 1100 నుంచి రూ. 66వేల వరకు వివిధ రకాల యూజర్‌ ఐడీలు ఉన్నాయని.. ఒక్కో ఐడీ కొనుగోలు చేసిన వారు వారికింద ఇద్దరు వ్యక్తులను చేర్పించాలని నిబంధన పెట్టాడు. వారు ఒక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పించాలి. ఇలా చేర్పిస్తూ పోతే అధిక మొత్తంలో కమీషన్‌ ఇస్తానని.. 10వ లెవల్‌కు వెళ్లేసరికి రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రూ. కోటి ఆదాయం వస్తుందని నమ్మించాడు. 

అప్పటికే అతడి మాయలో పడిపోయిన భక్తులు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే రూ.2 నుంచి 4కోట్ల వరకూ ముట్టజెప్పారు. ఇలా ఏడాదిలోనే భక్తుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 60 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మోసపోయిన భక్తులు పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడిని అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios