వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. భద్రాచలానికి హెచ్చరికలు
Kothagudem: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా స్కూళ్లకు సైతం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలో గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
Godavari water levels rising: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా స్కూళ్లకు సైతం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మియాపూర్ లోని జేపీనగర్ కమ్యూనిటీ హాల్ లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ లో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, టోలిచౌకి, హైదర్ నగర్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్రలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రచలంలో గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శరవేగంగా పెరుగుతూ గురువారం ఉదయం 10 గంటలకు 8,38,117 క్యూసెక్కుల విడుదలతో 40.80 అడుగులకు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరద నీరు తమ గ్రామాలకు చేరే వరకు వేచి చూడవద్దనీ, అధికారుల ఆదేశాల మేరకు ముందుగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని స్నానఘట్టాల్లోకి భక్తులను రానీయకుండా నిరోధించాలనీ, ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ముమ్మరం చేయాలన్నారు. అలాగే, భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయాలు, ముంపునకు గురయ్యే మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం కొత్తగూడెం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్- 08744-241950, వాట్సాప్ నంబర్- 9392919743, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్- 9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూం నంబర్- 08743-2324లకు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.