వాహనంతో ఢీకొట్టి, కాపాడేందుకు ప్రయత్నం.. హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే చనిపోవడంతో రోడ్డు మీదనే పారేసి..
ఓ డ్రైవర్ తన వాహనంతో పాదచారిని ఢీకొట్టాడు. దీంతో అతడికి గాయాలు అయ్యాయి. బాధితుడిని రక్షించడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ అతడు మరణించడంతో డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు.
ఓ బొలెరో వాహనం వేగంగా వెళ్తూ పాదచారిని ఢీకొట్టింది. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఆ బొలెరో డ్రైవర్ అతడిని కాపాడాలని అనుకున్నాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు తన వాహనంలో ఎక్కించుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి బాధితుడు మరణించాడు. దీంతో డెడ్ బాడీని రోడ్డు మీదనే పారేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆమనగల్లులో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయన్‌పల్లి తండాలో 39 ఏళ్ల జఠావత్ బద్యానాయక్ నివసిస్తున్నాడు. ఆయన సమీపంలో ఉన్నసూర్యలక్ష్మి కాటన్ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం పనికి వెళ్లేందుకు అదే రోజు తెల్లవారుజామున శ్రీశైలం నేషనల్ హైవేపై నడుస్తూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో వెనకాల నుంచి ఓ బొలేరో వాహనం వేగంగా వచ్చి బద్యానాయక్ ను ఢీకొట్టడంతో అతడు కింద పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ బొలేరో డ్రైవర్ బాధితుడిని రక్షించాలని భావించాడు. తన వాహనంలోనే ఎక్కించుకొని కల్వకుర్తి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించాడు. కానీ మార్గమధ్యంలోనే బాధితుడి పరిస్థితి విషమించి చనిపోయాడు.
ఈ పరిణామంతో డ్రైవర్ ఆందోళన చెందాడు. అతడి ఏం చేయాలో తోచలేదు. కొంత సమయం తరువాత డెడ్ బాడీని రోడ్డు పక్కన పారేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై భార్యకు సమాచారం అందింది. తన భర్తను ఎవరో హత్య చేసి ఉంటారని భావించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో బద్యానాయక్ ది హత్య కాదని, రోడ్డు ప్రమాదంలో మరణించాడని గుర్తించారు. ఆ బొలేరో డ్రైవర్ ను అరెస్టు చేశారని తెలుస్తోంది.