Asianet News TeluguAsianet News Telugu

బాబు చెల్లని రూపాయి.. ఆయన్ను రాహుల్ నెత్తిన పెట్టుకుంటున్నారు: హరీశ్

చరిత్రలో ఎన్నడూ కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయంటూ మహాకూటమిపై మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు.  హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ విమర్శలు చేశారు.

harish rao satires on chandrababu
Author
Hyderabad, First Published Nov 29, 2018, 12:47 PM IST

చరిత్రలో ఎన్నడూ కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయంటూ మహాకూటమిపై మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు.  హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ విమర్శలు చేశారు.

2014లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఇంకా అమలు చేయలేదన్నారు. బాబుకు పరిపాలన రాదంటూ ఏపీ కాంగ్రెస్ ప్రజా వంచన వారం పేరుతో ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ చంద్రబాబుతో రాసుకు పూసుకు తిరుగుతోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

నాటి మేనిఫెస్టోలను అమలు చేయని ఈ రెండు పార్టీలు ముందు జనానికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇది ప్రజా కూటమి కాదని దగా కూటమని దుయ్యబట్టారు. 2004, 2009 మేనిఫెస్టోలోని అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగలేఖ రాస్తున్నామని వీటికి ఆయన సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.

ఏపీలో చెల్లని చంద్రబాబు తెలంగాణలో చెల్లుతారా.. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబును పక్కనబెట్టుకుని రాహుల్ రుణమాఫీ చేస్తానంటే జనం నమ్ముతారా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

తెలంగాణలో విశ్వసనీయత ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరు మాత్రమేనన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిన రోజని... ఈ రోజును దీక్షా దివస్‌గా జరుపుకుంటామన్నారు. సాగర హారంలో ఫోటో వేసుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా..? ప్రజలు అన్ని గమనిస్తున్నారని హరీశ్ హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios