హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి  మాజీ తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారు. మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల సీఎంలు ఫడ్నవీస్, జగన్, గవర్నర్ నరసింహన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.  తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నది జలాలను వాడుకొనేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాలను వాడుకోవాలని ఆనాడు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు ప్రాజెక్టుల రీడిజైన్‌కు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు బదులుగా  కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోపుగా శరవేగంగా పూర్తి చేయడంలో ఆనాడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.

మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ  ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో పాటు....ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్స్‌ను తీసుకురావడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.

రాత్రిపూట కూడ కాళేశ్వరం  ప్రాజెక్టు పనులు నిర్వహించారు. కాళేశ్వరంతో పాటు మహాబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తై రైతులకు సాగు నీరు అందడంలో  హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.

కాలేశ్వరం ప్రాజెక్టు పనులను గతంలో గవర్నర్ నరసింహారావు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడాన్ని ఆయన అభినందించారు. ఆ మసయంలో మంంత్రి హరీష్ రావును గవర్నర్  అభినందించారు. హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ గవర్నర్ పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో హరీష్ రావు పాత్రను తీసీవేయకుండా ఉండేందుకు వీలుగా హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ ఆయన సంబోధించారు. 

ప్రాజెక్టు పనులను హరీష్ రావు  రాత్రి పూట ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రాజెక్టుల వద్దే హరీష్ రావు పడుకొన్న ఘటనలు కూడ ఉన్నాయి. 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది.

కేసీఆర్ కేబినెట్‌లో హరీష్ రావుకు చోటు దక్కలేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమానికి హరీష్ రావు దూరంగా ఉన్నారు. శుక్రవారం నాడు సిద్దిపేటలోనే పలు కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన యోగ దినోత్సవం పాటు జయశంకర్ వర్థంతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేనందున హరీష్ రావు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండడంపై సర్వత్రా  ఆసక్తి నెలకొంది.మంత్రి పదవి లేనందునే హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని అంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావును దూరం పెట్టారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారాన్ని హరీష్ రావు తోసిపుచ్చారు. కేసీఆర్ అప్పగించిన ఏ పనైనా తాను పార్టీ కార్యకర్తగా భాద్యతతో పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు.

 ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో హరీష్ ను మెదక్ ఎంపీ స్థానానికే పరిమితం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరీష్ రావు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు రోజున హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి కేసీఆర్ చేసిన కృషి ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు.