సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన రంగనాయకసాగర్ రిజర్వాయర్ లో కి గోదావరి నీళ్లు శుక్రవారం నాడు చేరాయి. రంగనాయకసాగర్ లో పంపుహౌస్ ద్వారా నీటిని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ శుక్రవారం నాడు ప్రారంభించారు.రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా 1.14 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల వెట్‌రన్‌ను ప్రారంభించారు. కాళేశ్వరం నీళ్లు  రంగనాయకసాగర్ లోకి చేరాయి.

 ఈ రిజర్వాయర్ ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందనుంది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు. రంగనాయక సాగర్ లో గోదావరి జలాలకు మంత్రులు, అధికారులు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.  ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్‌ నిరూపించారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేనిదన్నారు.

 సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశబ్ధాల కల సీఎం కేసీఆర్‌ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. 

ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని హరీష్  రావు చెప్పారు. మీ త్యాగాలు మరువలేనివి. త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడుతోందన్నారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో హరీష్ రావు కృషిని మరువలేమన్నారు. భగీరథుడు పై నుండి కిందకు నీరు తెచ్చారు, ఇవాళ సీఎం కేసీఆర్, హరీష్ రావు కింది నుండి పైకి నీరు తెచ్చారని ఆయన ప్రశంసించారు.

నాలుగున్నర ఏళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. సిద్దిపేటతో కేసీఆర్ కు విడదీయరాని సంబంధం ఉందన్నారు. రంగనాయకసాగర్ మా చేతుల మీదుగా ప్రారంభం కావడం గర్వంగా ఉందన్నారు. సిద్దిపేటవాసులు ధన్యజీవులన్నారు. 

రంగనాయక్‌సాగర్‌ వద్ద మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు పూజలు నిర్వహించి నీళ్లను వదలడం సిద్దిపేట ప్రజలు చేసుకొన్న అదృష్టమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. 

సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రజలు,రైతులు గత ఆరు దశాబ్ధాలుగా సాగునీళ్లకోసం,తాగునీళ్ల కోసం ఎదురుచూసిన కలలు నేడు సాకారం అయ్యాయన్నారు. ద్దిపేట కు గోదావరి జలాలు తెచ్చి మీ పాదాలు కడుగుతా అన్న సీఎం కేసీఆర్ మాట సార్ధకత ఇదే నిదర్శనం . చెప్పే మాటలు ..చేసే పనులు చేతల ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ అన్న మాటలు నిజమయ్యాయన్నారు.