సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత ట్రబుల్ షూటర్ హరీష్ రావు మరో రికార్డు నెలకొల్పారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు ట్రబుల్ షూటర్ హరీష్. 

అంతేకాదు దేశంలోనే అతిచిన్న వయస్సులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా హరీష్ రికార్డు నెలకొల్పారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన సభలో 1,20,650 ఓట్ల అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు హరీష్ రావు. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతం ఓట్లను హరీష్ రావు సాధించారు. లక్ష 20వేల 650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

మరోవైపు వరుసగా సిద్ధిపేట నియోజకవర్గంలో ఐదు సార్లు ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కుండా చేసిన ఘనత కూడా హరీష్ రావుకే దక్కుతుంది.  తెలంగాణ ఉద్యమ కేంద్రంగా పేరు తెచ్చుకున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి దేశవ్యాప్తంగా చర్చించేలా హరీష్ రావు భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు. 

 ఒకప్పుడు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి మేనమామ, రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోటీ చేశారు.  ఆతర్వాత ఆ నియోజకవర్గ బాధ్యతలను హరీష్ తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు హరీష్ అన్ని ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిద్ధిపేటలో హరీష్ గెలుపు నల్లేరు మీద నడకేనంత ప్రచారం వచ్చేసింది.  

అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో లక్ష మెజారిటీపై హరీశ్‌రావు ఆశలు పెట్టుకున్నారు ఆయన పెట్టుకున్న ఆశలను ఓటర్లు నిలబెట్టారు. హరీష్ ఆశించిన దానికంటే ఎక్కువ ఓట్లు వేసి మరోమారు తమ అభిమానాన్ని చాటుకున్నారు. 
 
2004లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ ఉపఎన్నికల్లో హరీశ్‌రావు బరిలోకి దిగారు. తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉన్నారు. 

2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మంత్రి ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరోసారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో అంజయ్యకు కేవలం 17,335 ఓట్లు మాత్రమే రావడతో ధరావత్తు కోల్పోయారు. 

ఇకపోతే 2009 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 85,843 ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి బైరి అంజయ్యకు కేవలం 21,166 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్‌ 64,677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్‌ దక్కలేదు. 

2010 ఉప ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,779 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 12,921 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్‌ 95,858 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,699 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 15,371 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఎన్నికల్లో హరీష్ రావు 93వేల 328 ఓట్లు మెజారిటీ సాధించగా ప్రత్యర్థి డిపాజిట్ కోల్పోయారు.  

అయితే గడిచిన రెండు ఎన్నికల్లో 90 వేలు మెజారిటీ సాధించిన హరీశ్‌రావు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన మెజారిటీని లక్ష దాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచించారు. 

దాంతోపాటు పోలింగ్‌ శాతం పెరిగితేనే మెజారిటీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించి విస్తృతంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మెుత్తానికి ఆయన అనుకున్న మెజారిటీ లక్ష దాటించారు. అలాగే డబుల్ హ్యాట్రిక్ సాధించిన వ్యక్తిగా దేశంలోనే అతిచిన్న వయస్సలో ఆరు సార్లు ఎన్నికైన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పారు.