తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుండి ఆమె రాజకీయ భవిష్యత్తుపై అందరూ అనేక రకాల ఊహాగానాలను వినిపించడం మొదలుపెట్టారు. 

అన్ని ఊహాగానాలకు తెరదించుతూ... ఆమెను ఎమ్మెల్సీ ని చేసి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్ నిశ్చయించుకున్నారు. 

ఇందుకు సంబంధించి నేటి ఉదయం ఆమె నిజామాబాదు నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలా నామినేషన్ దాఖలు చేసిన తరువాత అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Also read: ఎమ్మెల్సీగా తనయ కల్వకుంట్ల కవిత: కేసీఆర్ వ్యూహం ఇదీ....

తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాదు స్థానిక సంస్థల కోట నుండి ఎమ్మెల్సీగా  నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవితకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని హరీష్ రావు పోస్టు చేసారు. 

దీనికి కవిత థాంక్స్ బావ అని పోస్ట్ చేసారు. తమ మధ్య సంబంధ బాంధవ్యాలు బలంగా అలానే ఉన్నాయి అనే ఇండికేషన్ ని ఇవ్వడానికి కవిత అలా రేలషన్ తో సంబోధించారని అంటున్నారు. 

అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు కూడా థాంక్స్ అన్న అంటూ రిప్లై ఇచ్చారు కవిత. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా  కవితను ఆ పార్టీ బరిలోకి దింపింది. బుధవారం నాడు  ఉదయం ఆమె స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.  ఆ తర్వాత ఆమె నిజామాబాద్‌కు వెళ్లారు. 

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన  కవితకు ఆ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

 జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు  ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వెంట రాగా కవిత నిజామాబాద్ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు