తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఐదు గంటల్లో టీఆర్ఎస్, మహాకూటమి కలిసిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారం పంచుకోవడం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు లాలూచీ పడుతున్నాయన్నారు.

మహూకూటమిలోని అన్ని పార్టీలతో కేసీఆర్ గతంలో పొత్తు పెట్టుకున్నారని.. వీరందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మాఫీయా, రాజీవ్ గృహకల్పలో అక్రమాలపై కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారన్నారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని సీఎం మరచిపోయారన్నారు.. ఎందుకంటే సోనియా, రాహుల్ పట్ల ఆయనకు ఎంతో అభిమానం ఉందని నరసింహారావు దుయ్యబట్టారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఒంటరిని చేయడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రయత్నిస్తున్నాయని.. ఎవరెన్నీ రకాలుగా ప్రయత్నించినా బీజేపీని ఏం చేయలేరని జీవీఎల్ స్పష్టం చేశారు. మేడ్చల్ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సోనియా గాంధీ పథకం వేశారని నరసింహారావు ఆరోపించారు.

2013లో నాటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రత్యేకహోదాను రద్దు చేశారని జీవీఎల్ తెలిపారు. చట్టంలో లేనప్పటికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా ఏపీని ఆదుకున్నామని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.