తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుకు సంబంధించి వివరణ కోరేందుకు మంత్రి హరీష్ రావును గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు పిలిచే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు‌పై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే చివరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, సంబంధిత అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై చర్చించారు. 

అయితే తాజాగా వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుకు సంబంధించి వివరణ కోరేందుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ వైద్య అధికారులను, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని రాజ్‌భవన్‌‌కు పిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌భవన్‌ నుంచి సీఎంఓకు లేఖ పంపితే సంబంధిత మంత్రి హరీష్ రావు బిల్లు వివరాలను వివరించాల్సి ఉంటుంది. హెచ్‌ఓడిలకు కూడా వయోపరిమితి పెంచడమనేది ప్రధాన ఆందోళన అని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ తీరును టీఆర్ఎస్‌తో పాటు వామపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. గవర్నర్ కావాలనే బిల్లులను పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ తమిళిసై ఆ ఆరోపణలను ఖండించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని గవర్నర్ తమిళిసై ఇటీవల రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో తెలిపారు.