తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు లేఖ రాశారు. వీసీల నియామకంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని మొత్తం 11 వర్సీటీల్లో జూలైలోనే ఖాళీ అయిన ఛాన్సలర్ పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడంపై గవర్నర్ ఫైర్ అయ్యారు.

పది రోజుల్లోగా ఛాన్సలర్‌ను నియమించాలని డెడ్‌లైన్ విధించారు. కాగా, వీసీల నియామకం కోసం 2019 జూలై 23న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే రెండేళ్లుగా వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతూనే వుంది.

ఇటీవలే వర్సిటీల ఇంచార్జ్‌ వీసీలు, రిజిస్ట్రార్‌లతో గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్వ విద్యార్ధులను యూనివర్సిటీలతో అనుసంధానంపై గవర్నర్ ఆరా తీశారు. 

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. ఏళ్ల తరబడి గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే నెట్టుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడుతోంది.

కీలకమైన వైస్‌ చాన్సలర్ల పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉండడం, పాలకమండళ్లను నియమించకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో వర్సిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి.