హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుకొన్న కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది.  స్మగ్లర్లు బలవంతంగా తమ వెంట బంగారాన్ని పంపారని యాత్రికులు తెలిపారు. బంగారాన్ని తీసుకెళ్లకపోతే తప్పుడు కేసులు పెడతామని తమను బెదిరించారని బాధితులు పోలీసుల విచారణలో చెప్పారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో  హైద్రాబాద్‌ కు చెందిన వారి నుండి డిఆర్ఐ, కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హైద్రాబాద్‌కు చెందిన 16 మంది యాత్రికులు జెడ్డాకు వెళ్లారు. 

జెడ్డాకు వెళ్లిన  ఈ 16 మంది యాత్రికులను స్మగ్లర్లు బెదిరించారు. హైద్రాబాద్ లో తాము చెప్పిన చోటు బంగారాన్ని ఇవ్వాలని స్మగ్లర్లు బెదిరించారని బాధితులు పోలీసుల విచారణలో చెప్పారు.

తాము బంగారాన్ని హైద్రాబాద్‌కు తీసుకురానని చెబితే తమపై తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని బాధితులు వివరించారు.జెడ్డా పోలీసులకు అప్పగిస్తామని చెబితే భయపడినట్టుగా బాధితులు  పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని సమాచారం.  బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒ:ప్పుకోనందుకు తమను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని బాధితులు చెప్పారని తెలిసింది.

హైద్రాబాద్ నుండి  జెడ్డాకు అతి తక్కువ ఖర్చుతో తీసుకెళ్లిన నిర్వాహకులు హైద్రాబాద్‌కు తిరిగి వచ్చే సమయంలో  బంగారాన్ని స్మగ్లింగ్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా బాధితులు చెప్పారు. ఈ విషయమై పోలీసులు  విచారణ చేస్తున్నారు.