రెండేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. పెద్దల్ని ఒప్పించారు. కానీ వరకట్నం వారి ప్రేమను హేళన చేసింది. డబ్బు వారిని డామినేట్ చేసింది. చివరకు ఆ ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తండాలో విషాదం అలుముకుంది. 

నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అడిగినంత కట్నం ఇవ్వాలి.. లేదంటే పెళ్లి జరగదని ప్రియుడు ప్రియురాలికి తెగేసి చెప్పాడు. దీంతో.. మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, లింగారం తండా శివారు బోటిమీది తండాకు చెందిన ఎంఫార్మసీ చదువుతున్నా వడిత్యా లైలా (23) అదే తండాకు చెందిన డిప్లమా చదువుతున్న ప్రవీణ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికోసం ఇరువురు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఇటీవల పెద్దల సమక్షంలో వివాహం జరిపేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో కట్నంగా  కొంత నగదు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

అయితే యువకుడు, అతని తల్లిదండ్రులు కట్నం సరిపోదని, మరింత ఎక్కువ ఇస్తేనే పెళ్లి అని భీష్మించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన లైలా ఈ నెల 9వ తేదీన పురుగుల మందు తాగింది.

 ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ప్రవీణ్, తల్లిదండ్రులు మంగు, బుజ్జి, తమ్ముళ్లు గణేష్, ప్రశాంత్ పై మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.