వరంగల్: ఇద్దరిని ప్రేమించిన యువతి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. వరుసకు సోదరుడైన యువకుడిని ప్రేమించింది. అంతకు ముందు అతని మిత్రుడిని ప్రేమించింది. తమ మధ్య సంబంధం సాఫీగా సాగాలంటే తాను తొలుత ప్రేమించిన వ్యక్తిని మట్టుబెట్టాలని సోదరుడికి నూరిపోసింది. 

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలను వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. 

వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్ షిప్ కు చెందిన కోమటి విజయ్, రెడ్డిమల్ల రాంకీ స్నేహితులు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే సంబంధాల నేపథ్యంలో రాంకీ పెద్దనాన్న కూతురు, కాజీపేటకు చెందిన రెడ్డిమల్ల యామిని పరిచయమైంది. విజయ్ తో ఆమె ప్రేమలో పడింది. వారి వివాహానికి విజయ్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 

ఇదే సమయంలోో వరుసకు తమ్ముడైన రాంకీతో కూడా యామినికి శారీరక సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ వరంగల్ డాక్టర్స్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని తమ సంబంధంాన్ని కొనసాగిస్తున్నారు. ఓ రోజు రాంకీ తన స్వగ్రామమైన వర్ధన్నపేటకు యామినిని తీసుకుని వెళ్లాడు. ఇద్దరూ మద్యం సేవించి గొడవ పడ్డారు. 

తాను విజయ్ తో కలిసినప్పటి ఫొటోలను మిత్రులకు పంపిస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని, దాంతో తమ సంబంధం సాఫీగా సాగుతుందని తమ్ముడికి చెప్పింది. దాంతో రాంకీ ఈ నెల 4వ తేదీన తన ఇంటికి పిలిచాడు. 

తన ఇంటికి వచ్చిన విజయ్ తో కలిసి రాంకీ వివిధ ప్రాంతాల్లో కారులో తిరిగాడు. ఆ తర్వాత 5వ తేదీన గీసుకొండ శివారు కాకతీయ కెనాల్ వద్ద ఇద్దరూ కల్లు సేవించారు. మత్తులో ఉన్న విజయ్  ముఖంపై రాంకీ బలంగా మోది కెనాల్ లోకి తోసేశాడు. దీంతో రాంకీ కెనాల్ లో కొట్టుకుపోయాడు 

ఈ నెల 7వ తేదీన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్ లో మృతదేహం కొట్టుకు వచ్చింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదని విజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ మృతదేహం విజయ్ దని పోలీసులు గుర్తించి విచారణ జరిపారు. విచారణలో అసలు విషయం బయటపడింది. రాంకీని, యామినిని పోలీసులు అరెస్టుచేశారు.