హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్దం చేసింది.ఈ ఏడాది పిబ్రవరి 11 వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నెల 11వ తేదీన కొత్త కార్పోరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు.జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల పర్యవేక్షణకు సీనియర్ ఐఎఎస్ ను  నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తై నెల రోజులు దాటినా కూడ కార్పోరేటర్లు ఎన్నిక గురించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బీజేపీ కార్పోరేటర్లు ధర్నా నిర్వహించారు.

దీంతో ఇటీవలనే కొత్త కార్పోరేటర్లు ఎన్నికైనట్టుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ మేయర్  ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.