Gas leake: పాల్వంచలో కూతురుతో పాటు తల్లిదండ్రులు సజీవ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు మరణించారు.
కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాల్వంచలోని ఓ ఇంట్లో సిలిండర్ గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు కూతురు మరణించింది. వారిని రామకృష్ణ, లక్ష్మి, సాహిత్యలుగా గుర్తించారు. నాగరాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిలో సాహిత్య అనే కూతురు మరణించగా, సాహితి అనే కూతురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
రామకృష్ణ మీ- సేవలో పనిచేస్తూ పాల్వంచలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే, అకస్మాత్తుగా గ్యాస్ లీకై ముగ్గురు ఆహుతి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ చేసుకుని మంటలు అంటించుకుని కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చుననే సందేహం వ్యక్తమవుతోంది. అయితే, రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవని స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు పట్టరాని విధంగా మృతదేహాలు మంటల్లో కాలిపోయాయి. ఈ సంఘటన స్థానిక తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్ బీ కాలనీలోని శివపార్వతి సినిమా థియేటర్ కాలి బూడదైంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.20 గంటల ప్రాంతంలో ఈ Fire Accident సంభవించింది. సిబ్బంది అప్రమత్తమయ్యేలోగానే థియేటర్ కాలి బూడిదైంది.
మంటలను ఆర్పడానికి మూడు ఫైర్ ఇంజన్లను వాడారు. మంటలను ఆర్పడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. దాదాపు రూ. 2 కోట్ల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు.
ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా ముగిసిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తాళాలు వేశారు. ఆ తర్వాత శివపార్వతి థియేటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. థియేటర్ లోని సీట్లతో పాటు ప్రొజెక్టర్, తెర మొత్తం కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.