హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి మధ్య అగాధం పెరుగుతోంది.అవసరమైతే తాను ఇంటి వద్ద నుండే కార్యక్రమాలను నిర్వహిస్తానని జోషి తన కార్యాలయ వర్గాలకు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం ఉన్న  సచివాలయాన్ని కూల్చివేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై కోర్టులో కేసు కొనసాగుతోంది. అయితే సచివాలయంలోని శాఖలన్నీ ఆయా శాఖల హెచ్‌ఓడీ కార్యాలయాలకు తరలించాలని నిర్ణయం తీసుకొన్నారు. మరికొన్ని శాఖలను బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించారు.

తెలంగాణ సీఎస్ ఎస్‌కె జోషీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టక ముందే నీటిపారుదల శాఖకు స్పెషల్ సెక్రటరీగా పనిచేశాడు. సీఎంఓలో సెక్రటరీగా స్మితా సబర్వాల్ పనిచేస్తున్నారు. 

సీఎంఓ నుండి ప్రాజెక్టుల నిర్వహణ విషయాన్ని స్మిత సబర్వాల్ పర్యవేక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణ పనులను కూడ ఆమె పర్యవేక్షించేవారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ పనులను స్మితా సబర్వాల్ తన కంటే ముందుగా ఒకరోజునే ప్రారంభించారని రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి కొంత అసంతృప్తికి గురైనట్టుగా ప్రచారంలో ఉంది. స్మితా సబర్వాల్ పంపింగ్ పనులను ప్రారంభించిన మరునాడు పంపింగ్ కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అధికారికంగా మీడియాకు సమాచారం అందింది. అయితే  ఈ కార్యక్రమంలో జోషి పాల్గొనలేదు.

సచివాలయం తరలింపు విషయంలో కూడ  ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఇతర అధికారుల ముందే సీఎం తనపై పరుషంగా మాట్లాడడడంతో సీఎస్ జోషి నొచ్చుకొన్నట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై జోషీని వివరణ కోరేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తే ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు.

సచివాలయంలో ఇంటర్నెట్ తో పాటు ఇతర సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రానందున ఇంటి నుండే పనిచేస్తానని జోషి కార్యాలయవర్గాలకు చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ ఏడాది  డిసెంబర్ 31వ తేదీతో జోషి పదవీకాలం  పూర్తి కానుంది. కేసీఆర్‌తో కొంత గ్యాప్ ఏర్పడిన కారణంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశం లేకపోవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు కూడ లేకపోలేదు.