గజ్వేల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై పోటీకి దిగిన అభ్యర్థి ఒకరు అదృశ్యమయ్యారు. సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కె.దినేశ్ చక్రవర్తి ఈ నెల 22 నుంచి కనిపించడం లేదు. ఆయన ఆచూకీ దొరకడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని.. దీని వెనుక టీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత మురళీధర్‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై స్పందించిన  జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం... దినేష్‌ని మంగళవారం తమ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన దినేశ్ చక్రవర్తి 19న గజ్వేల్‌లో నామినేషన్ వేశారు. తర్వాత ఆయన జనానికి రెండు, మూడు సార్లు కనిపించారు. అనంతరం ఈ నెల 22న నామినేషన్ ఉపసంహరించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మరోవైపు దినేశ్ అదృశ్యం కాలేదని కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లామని.. మంగళవారం కోర్టుకు వస్తానని చక్రవర్తి తెలిపినట్లు గజ్వేల్ పోలీసులు వెల్లడించారు.