తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. అయితే తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ది  పొందాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట రమణారెడ్డిలపై తప్పడు కేసులే నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డీకె. అరుణ భర్త భరతసింహా రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. 

తనపై పెట్టిన కేసులకు నిరసనగా భరతసింహా రెడ్డి గద్వాల పరిధిలోని మల్దకల్ పోలిస్ స్టేషన్ ముందు బైటయించి నిరసనకు దిగారు. తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తనపై పెట్టిన కేసులో నిజానిజాలను తేల్చి తనకు న్యాయం చేయాలని భరతసింహా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి కొంత డబ్బును అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే అతడిని పోలీసులు విచారించగా గద్వాల మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డికి చెందినవిగా తెలిపాడు. దీంతో పోలీసులు డబ్బులు తరలిస్తున్న వ్యక్తితో పాటు భరతసింహారెడ్డి పై కేసు నమోదు చేశారు. 

అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని...ప్రత్యర్థులు తనను కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఈ డబ్బులు  పట్టుబడిన సమయంలో తాను గద్వాలలోనే లేనని... హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నానని తెలిపారు. తన పేరు కేసులో ఎందుకు ఇరికించారో పోలిసులు తెలపాలని లేదా 41నోటిసు ఇవ్వండని పోలిసులను ఆయన పోలీసులను కోరారు. అప్పటి వరకు స్టేషన్ బయటే నిరసన కొనసాగిస్తానని భరతసింహ రెడ్డి స్పష్టం చేశారు.