బాసర ఆలయంలో ప్రసాదం లడ్డూలకు ఫంగస్.. భక్తుల ఆగ్రహం..
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో అధికారుల తీరు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. బాసర సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలు పాడైపోయాయని భక్తులు మండిపడుతున్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో అధికారుల తీరు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. బాసర సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలు పాడైపోయాయని భక్తులు మండిపడుతున్నారు. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకిందని ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అభిషేకం లడ్డూలకు ఫంగస్ ఏర్పడి పాడైపోయాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శరన్నవరాత్రుల వేళ బాసర సరస్వతి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు పెద్ద సంఖ్యలో లడ్డూలను సిద్దం చేయగా.. వాటిని సరిగా నిల్వ చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆలయంలో వేల సంఖ్యలో అభిషేకం లడ్డూలు పాడైనట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ విషయం బయటకు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొన్ని లడ్డూలను సిబ్బంది వేరు చేసి ఆరబెడుతున్నారు. అంతేకాకుండా.. పూర్తిగా పాడైన లడ్డూలను కనిపించకుండా బయట పడేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఆలయంలో లడ్డూలు పాడైన సందర్భాలు ఉన్నాయని.. పలుమార్లు ఇలా జరుగుతున్న సిబ్బంది తీరులో మార్పు రావడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తామని.. అలాంటి లడ్డూ ప్రసాదానికి ఫంగస్ వచ్చి పాడు కావడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.