Asianet News TeluguAsianet News Telugu

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా వరుడి అవతారమెత్తి మోసాలు.. విలాసాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్

తాను ఎన్‌ఆర్ఐ వరుడినని, పెళ్లయ్యాక అమెరికా తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా అమాయక యువతులకు వలవేసి లక్షలు గుంజాడు. తీరా లక్షలు తన ఖాతాలోకి మార్చుకున్నాక ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుంటాడు. ఈ తీరులో లక్షల రూపాయలను సొమ్ము చేసుకున్న ఓ సైబర్ నేరగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విలాసాలు, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తర్వాత భార్య విడాకులివ్వడంతో మోసాలు మొదలుపెట్టాడు.
 

fraudster arrested by hyderabad police who made duping innocent   woman through matrimonia websites
Author
Hyderabad, First Published Aug 28, 2021, 5:43 PM IST

హైదరాబాద్: విలాసాలు, గుర్రం పందేలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయాడు. భార్య విడాకులిచ్చింది. ఉద్యోగం పోవడంతో డబ్బుల కోసం ఆ ప్రబుద్ధుడు అడ్డదారి తొక్కాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపరిచి అమాయకులకు ఎరవేయడం ప్రారంభించాడు. ఎన్ఆర్ఐ వరుడిగా నమ్మించి లక్షల రూపాయలు మోసం చేశాడు. రాచకొండ, సైబర్ క్రైమ్ శాఖ పోలీసులు ఈ ఘరానా నిందితుడు పొట్లూరి బాల వంశీక్రిష్ణ(35)ను అరెస్టు చేశారు. నిందితుడు ఖమ్మంలోని భురంపురంలోని నివసిస్తున్నాడు.

నిందితుడు బాల వంశీక్రిష్ణ హార్స్ రేసింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. భార్య విడాకులివ్వడం, ఉద్యోగం లేకపోవడంతో 2020లో మ్యాట్రిమోనియల్‌లో తన వాస్తవ వివరాలను నమోదు చేసి వధువు కోసం వెతికాడు. ఎన్‌ఆర్ఐ వరుడిగా నమ్మించి కనీసం నలుగురిని మోసం చేసి లక్షల రూపాయలను కాజేశాడు. అప్పుడే సైబర్ క్రైం పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

తన వాస్తవ వివరాలు నమోదు చేయడం వల్లే పోలీసులు అరెస్టు చేశారని భావించి నకిలీ వివరాలను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. చౌటుప్పల్‌కు చెందిన ఓ వధువును పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఫోన్ ద్వారా ఆమెను కాంటాక్ట్ అయ్యాడు. పెళ్లి తర్వాత అమెరికా తీసుకెళ్తానని నమ్మించి వీసా ప్రాసెసింగ్ చార్జీల కోసం, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కోసం రూ. 90వేలను సొమ్ము చేసుకున్నాడు. వీసా కోసమని పాన్, ఆధార్, ఫొటోలు వంటివి తీసుకున్నాడు. తర్వాత యోనో ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలూ తీసుకుని లోన్ అర్హతలు పరిశీలించాడు. ప్రీఅప్రూవల్ లోన్‌కు రూ. 8లక్షలున్నట్టు చూసి అప్లై చేశాడు. ఎస్‌బీఐ అకౌంట్‌లో డబ్బులు పడగానే తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఇలాగే ఇతరులనూ మోసం చేశాడు.

అందుకే వరుడి పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ నుంచి ఫోన్ చేస్తే వెబ్‌క్యామ్ ద్వారా మాట్లాడాలని, తెలిసిన వ్యక్తులతో సదరు వరుడి/లేదా మోసకారి వివరాలను ధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు. డబ్బులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లో పంపవద్దని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios