హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయింతో సంబంధాలు కలిగి ఉన్న అధికారుల మెడకు ఉచ్చు బిగించేలా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పావులు కదుపుతోంది. నయింతో ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారనే విషయమై ఆధారాలతో లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయనుంది.

గ్యాంగ్ స్టర్ నయిం కేసులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుకు వెళ్తోంది. గ్యాంగ్‌స్టర్ తో సంబంధాలు కలిగి ఉన్న పోలీసులు, అధికారుల సమాచారంతో  లోక్‌పాల్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రాష్ట్ర విభజన తర్వాత కూడ గ్యాంగ్ స్టర్ నయిం అనేక వివాదాల్లో తలదూర్చాడు. 2016 ఆగష్టు 8వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్  పట్టణంలో గల మిలీనియం టౌన్ షిప్ లో  పోలీసుల ఎన్ కౌంటర్ లో నయిం మృతి చెందాడు.

నయింతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న  పోలీసులు, రెవిన్యూ అధికారుల గురించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధారాలను సేకరించింది.  ఈ మేరకు ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాలతో లోక్‌పాల్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది.ఆర్టీఐ ద్వారా పోలీసులు, రెవిన్యూ అధికారులు నయింతో కలిగి ఉన్న సంబంధాల గురించి సమాచారాన్ని సేకరించింది.