హైదరాబాద్: తాను ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ను ఓడించేందుకు ప్రయత్నించాననే ప్రచారంలో వాస్తవం లేదని  మాజీ ఎంపీ వివేక్  స్పష్టం చేశారు. తన వర్గీయులను కలుపుకొనిపోవాలని ఈశ్వర్ కు చెప్పినా కూడ స్పందించలేదని  ఆయన చెప్పారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు  తాను ప్రయత్నించినట్టు  వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సోమవారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

తమ వర్గీయులను  కలుపుకుపోవాలని  కేటీఆర్ సమక్షంలోనే కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. కానీ ఈశ్వర్  తమ వర్గీయులను కలుపుకుపోలేదన్నారు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తే త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  తనకు ఇబ్బంది కలగదా అని ఆయన ప్రశ్నించారు.

తాను  ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ వచ్చిందని  ఆయన తెలిపారు.  తాను ఈశ్వర్‌ను ఓడించేందుకు ప్రయత్నించినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి రిటైర్ అవుతానని  తాను కేటీఆర్ ముందే స్పష్టం చేసినట్టు తెలిపారు.

2015లోనే తాను టీఆర్ఎస్ లో చేరిన సమయంలో  పెద్దపల్లి ఎంపీ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో  తిరిగేందుకు వీలుగానే తనకు ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

బెల్లంపల్లి నుండి కూడ తన సోదరుడు వినోద్ ను పోటీ చేయకూడదని  కోరినట్టు చెప్పారు. తనకు ఇచ్చే పదవిని కూడ  అన్నకు ఇస్తానని చెప్పినా కూడ వినకుండా  నా సోదరుడు పోటీ చేశారని చెప్పారు. పోటీకి దూరంగా ఉండాలని  చెప్పినా వినకుండా నా సోదరుడు బరిలోకి దిగాడని చెప్పారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో టీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు గతంలో తాను విస్తృతంగా పని చేసినట్టు ఆయన తెలిపారు. తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

సంబంధిత వార్తలు

రంగంలోకి కేటీఆర్: కొప్పుల ఈశ్వర్, వివేక్ మధ్య గొడవకు చెక్