సమైక్యాంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పనిచేసిన దినేశ్ రెడ్డి మేనల్లుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఎంఎల్ఎన్ రెడ్డి కుమారుడు హరిహరరెడ్డి (50) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 5లో నివసిస్తున్న హరిహరరెడ్డికి ఆయన భార్యతో మనస్పర్థలు రావడంతో పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న హరిహరరెడ్డికి కొద్దిరోజుల క్రితం బ్రెయిన్ ట్యూమర్ రావడంతో శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 15వ తేదీ రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని ఇంటి సమీపంలో తెలిసినవారిని మాత్రలు అడిగారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేదు.

ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఆయన సోదరుడు ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన లోపలికి వెళ్లి చూడగా.. ఆయన చనిపోయి పడివున్నారు.. మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.

జంతు ప్రేమికుడైన హరిహరెడ్డి ఇంట్లో కుక్కలు, పిల్లులు ఉన్నాయి.. ఆకలి తట్టుకోలేకపోవడంతో మృతదేహం ఎడమ భుజం, చేతి వేళ్లను పెంపుడు జంతువులు పీక్కుతిన్నాయి. ఆయన ఎప్పుడు మరణించాడో ఎవరికి తెలియదు..

ఆరు రోజుల క్రితం మరణించి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఒంటరితనాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక అనారోగ్యంతో మరణించాడా..? లేదంటే ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.