హైదరాబాద్: దశాబ్ధాల కాలంగా వారు  కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగొందుతున్నారు. రాష్ట్రమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా పలు కీలక స్థానాలు అధిరోహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుల్లా వెలుగొందారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వంలో  కీలక శాఖలకు మంత్రులుగా పనిచేసి ప్రఖ్యాతిగాంచారు. మరికొందరు అయితే కేంద్రమంత్రులుగా దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పారు. ఇక మరికొందరు అయితే డిప్యూటీ సీఎలుగా తమ ఉనికిని చాటుకున్నారు. 

 ఇంకా చెప్పాలంటే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కూడా తమకు తామే ప్రకటించేసుకున్నారు. అలాంటి రాజకీయ ఉద్దండులను 2018వ సంవత్సరం మట్టి కరిపించింది. ముందస్తు ఎన్నికల్లో వారంతా టీఆర్‌ఎస్ చేతిలో చావుదెబ్బతిన్నారు. 

పార్టీ ఫలితాలతో డీలా పడటమే కాదు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలకు ముఖం చూపించాలంటేనే జంకుతున్నారు. గతంలో పలుమార్లు జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీల నుంచి ఎంత ఎదురుగాలి వీచినా ఈ రాజకీయ ఉద్దండులు హవాకు బ్రేక్ లు పడలేదు. విజయ కేతనం ఎగురు వేస్తూనే ఉన్నారు. 

కందూరు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, గీతారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్‌గౌడ్, మల్లు రవి, సర్వే సత్యనారాయణ వీళ్లంతా కాంగ్రెస్ పార్టీలో ముదుర్లుగా చెప్పుకోవచ్చు.  

గడిచిన ఎన్నికల్లో తెలగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ వీరిలో చాలా మంది గెలుపొందారు. అయితే జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ గౌడ్, మల్లు రవిలు గతంలో ఒకటి రెండు సార్లు ఓటమి పాలైనా మిగిలిన నాయకులు తక్కువ సార్లు ఓడిపోయారు. 

కందూరు జానారెడ్డి ఏక ధాటిగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు గెలిచి ఉంటే డబుల్ హ్యాట్రిక్ సాధించేవారు. అత్యధిక సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా అరుదైన రికార్డు సాధించేవారు. అలాంటి రాజకీయకురువృద్ధుడికి ఓటమి తప్పలేదు. 

ఇకపోతే జహీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జె.గీతారెడ్డి. ఈమె రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించి లేడీ బాస్ గా పేర్గాంచారు. ఈసారి గెలిపిస్తే మహిళా కోటాలో ముఖ్యమంత్రిని అయిపోతానంటూ ఓటర్లను అభ్యర్థించినా తిరస్కరించారు.

ఇకపోతే దామోదర రాజనర్సింహ. ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్నలిస్ట్ నేత క్రాంతి కిరణ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. దామోదర రాజనర్సింహ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. వివిధ మంత్రిత్వ శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ సెంటిమెంట్ వంటి అంశాలపై మంచి అవగాహన ఉన్న దామోదర ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటుూ ఉంటారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాంటి వ్యక్తి కూడా బొక్క బోర్లా పడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకురాల్లో మరో నేత డీకే అరుణ.  మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఈమె టీఆర్ఎస్ అభ్యర్థిచేతిలో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేవారిలో, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగే వారిలో ముందు వరుసలో ఉంటారు డీకే అరుణ. 

తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సందర్భంలోనూ ఈమె విజయం సాధించారు. అలాంటి ఆమెను కూడా 2018వ సంవత్సరం మట్టి కరిపించింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించిన ఆమె మహిళా కోటాలో తాను సీఎం అయిపోతానంటూ కూడా ఆశపడ్డారు. కానీ ఆమె ఆశలను ఓటర్లు ఆడియాశలు చేశారు. 

ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఓ గుర్తింపు ఉంది. నల్గొండ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వీరికి 2018 ఎన్నికల ఫలితాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. 

నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ తనకు ఎదురేలేదనుకుంటున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డికి గట్టి దెబ్బకొట్టాయి 2018 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కోమటిరెడ్డి. అయితే తాను ఏరికోరి తెచ్చుకున్న అభ్యర్థి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గెలిపించుకోగలిగారు కానీ ఈయన గెలవలేదు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఈయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. తెలంగాణ అసెంబ్లీలో ఈయన ప్రవర్తించిన తీరుకు వీరిని శాసనసభ వీరి సభ్యత్వాన్ని రద్దు చేసింది.  

ముందస్తు ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరించిన తీరు అంతా వివాదాస్పదమే. పీసీసీ చీఫ్ ను మార్చాలని గట్టిగా కోరిన వారిలో వీరే. పీసీసీ చీఫ్ పైనా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పైనా బాహటంగా విమర్శలు చేసింది కోమటి రెడ్డి బ్రదర్స్. 

అలాంటి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నారు. చివరికి కోమటిరెడ్డిని ఏడ్చేలా చేసింది 2018. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం కాస్త ఊరట నిచ్చింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెుదటి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. ఈయన కూడా అతిఘోరంగా ఓడిపోయారు. జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన టిక్కెట్ దక్కకపోవడంతో బోరున విలపించారు. టిక్కెట్ సంపాదించడంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించగలిగిన ఈయన ఎన్నికల్లో ప్రజలను గెలవలేకపోయారు. దీంతో 2018 ఎన్నికల్లో చతికిలపడ్డారు. 

అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ. సర్వే సత్యనారాయణ అతి దారుణంగా ఓడిపోయారు. సినీనటి నగ్మాతో ప్రచారం చేయించిన సీటు దక్కించుకోలేకపోయారు. తాను గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఒక్కసారి గెలిపించండి అంటూ బాహటంగా ప్రకటించినా ఓటర్లు దరిచేర్చుకోలేదు. దీంతో ఘోరంగా ఓటమిచెందారు. 

అయితే కంటోన్మెంట్ సీటును సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ ఆశించారు. అయితే అధిష్టానం దగ్గర ఉన్న పలుకబడితో సర్వే ఆఛాన్స్ కొట్టేశారు. దీంతో మామపై పోటీకి దిగుతానని హెచ్చరించారు. సర్వే సత్యనారాయణ ఓడిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. అల్లుడి శాపం తగిలిందో ఏమో తెలియదు కానీ ఆయన ఓడిపోయారు. 

ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నేతలైన మల్లు రవి, జీవన్ రెడ్డిల పరిస్థితి అంతే. ఇద్దర్నీ 2018లో జరిగిన ఎన్నికలు ఇంటికే పరిమితం చేశాయి. అయితే మల్లు రవి సోదరుడు మల్లు భట్టివిక్రమార్క విజయం సాధించడం విశేషం. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వీళ్లు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ నిరుత్సాహంలో పడిపోతుందని భావిస్తున్న వీరు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ లు వేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత వచ్చిందని అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనిప్రధాని కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని చెప్తున్నారు.  

పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ఎలాగోలా గెలిస్తే రాహుల్ టీంలో అయినా కేంద్రమంత్రి పదవి దక్కుంచుకోవచ్చనే ఆశతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు. ఇప్పటికే హస్తిన పెద్దలతో రహస్యంగా చర్చలు సైతం జరుపుతున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో అయినా టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపి పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ ఉద్దండులు రాజకీయ అనుభవ పాఠాలను ప్రయోగించేందు రెడీ అవుతున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించాలని చేస్తున్న వీరి ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి. 2018 ఎలాగూ  కలిసి రాలేదు కనీసం 2019 అయినా కలిసి వస్తుందో లేదో చూద్దాం మరి.