పరకాల: పరకాల గడ్డపై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ ఘోరంగా ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. తనను అవమానించిన పార్టీకి బుద్ధి చెప్పాలని బరిలోకి దిగిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేతిలో చతికిలపడ్డారు. 

గతంలో పరకాల నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందిన నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో ఈజీగా గెలుస్తానని ఆమె ఊహించారు. అంతేకాదు పరకాల నియోజకవర్గం ఏర్పడిప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు విజయబావుటా ఎగురవేసింది. అందులో ఒకసారి కొండా సురేఖ విజయపతాకం ఎగురవేశారు. 

ఈ ఏడోసారి అయినా విజయం సాధించాలని ఆమె ఆశించారు. కానీ ఆమె ఆశలు ఆడియాసలు అయ్యాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఏడాది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో నిలిచారు. 

సమీప ప్రత్యర్థి భిక్షపతిపై 13 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె వైఎస్ కేబినేట్ లో మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. 

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెపై అనర్హత వేటు వెయ్యడంతో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కొండా సురేఖ ఓటమిపాలయ్యారు. 

తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు కూడా. అయితే సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చెయ్యడం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. 

అయితే ఆ తొలిజాబితాలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో పరకాల టిక్కెట్ దక్కించుకున్నారు. 

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఫైర్‌బ్రాండ్‌ కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ నుంచి పి.విజయచంద్రారెడ్డి పోటీపడ్డారు. అయితే చల్లా ధర్మారెడ్డి మెుదటి నుంచి ఆధిక్యత కనబరుస్తూనే వచ్చారు.  
 
తనకు టిక్కెట్ ఇవ్వకకుండా టీఆర్ఎస్ పార్టీ అవమానించిందని అదే నియోజకవర్గం నుంచి గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని కొండా సురేఖ పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ ఆమె ఆశలను ఓటరు దేవుళ్లు నెరవేర్చలేదు.   

కొండా సురేఖ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గానికి కొండా సురేఖ ఆరేళ్లపాటు దూరమయ్యారు. దీంతో కార్యకర్తలు కొండా సురేఖ అనుచరులు చెదిరిపోయారు. అంతేకాదు ఆమె పార్టీలు మారడం కూడా అభిమానుల్లో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. 

కాంగ్రెస్, టీఆర్ఎస్ మళ్లీ కాంగ్రెస్ ఇలా వరుసగా పార్టీలు మారడంతో క్యాడర్ అసహనానికి గురై ఆమెకు దూరమయ్యారు. చల్లా ధర్మారెడ్డిపై ఎన్ని ఆరోపణలను చేసినా ప్రజలు పట్టించుకోలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ధర్మారెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని, కాంట్రాక్టులన్నీ తీసుకుని కాంట్రాక్టర్ గా మారిపోయారంటూ ఆయన ఓ అవినీతి పరుడంటూ ఘాటు విమర్శలు చేశారు. 

అంతేకాదు టీఆర్ఎస్ పైనా, కేసీఆర్, కేటీఆర్ లపైనా రాయడానికి వీలులేనటువంటి బూతులు సైతం తిట్టారు కొండా దంపతులు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. కొండాను ఆదరించలేదు.  

ఇకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపుకు దోహదం చేశాయి. పరకాల గ్రామ పంచాయితీని పురపాలక సంఘంగా మార్చడం, రెవెన్యూ డివిజన్‌ను సాధించడం, రూ.1200కోట్లతో మెగా టెక్స్ టైల్స్ పరిశ్రమకు శంకుస్థాపన, 120 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించడం వంటి కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడ్డాయని చల్లా ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.