తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతంది.  కాగా..ఓటమిని తట్టుకోలేక.. ఓ మహాకూటమి అభ్యర్థాి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.

మహాకూటమి తరపున టీడీపీ పోటీచేస్తున్న శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీడీపీ తరపున సినీ నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి అరికెపూడి గాంధీ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అరికెపూడి గాంధీ.. గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. టీడీపీకి గట్టిబలం ఉన్న ప్రాంతం కావడంతో.. ఇక్కడి గెలుపుపై ఆనంద్ ప్రసాద్ ఆశలు పెటుకున్నారు. అయితే మూడు, నాలుగు రౌండ్లు ముగిసినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థికే ఆధిక్యం కనిపించింది. దీంతో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
 
ఆఖరు నిమిషంలో టీడీపీ తరపున టికెట్‌ను దక్కించుకున్న భవ్య ఆనంద్ ప్రసాద్.. గెలుపు కోసం విపరీతమైన ప్రచారం చేశారు. సినీరంగానికి చెందిన వ్యక్తి కావడంతో.. కొందరు సినీ నటులు కూడా ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ ప్రచారం సాగించారు. అయినప్పటికీ ప్రస్తుతం టీఆర్ఎస్ ఆధిక్యం కనపరుస్తోంది. టీడీపీ తప్పక గెలుస్తుందని నమ్మి.. అక్కడి టికెట్‌ను దక్కించుకున్న భవ్య ఆనంద్ ప్రసాద్‌కు ఈ పరిణామం కొంత చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పవచ్చు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు.