గిట్టుబాటు ధర కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతులు రోడ్డెక్కారు. ఎర్రజొన్న క్వింటాకు రూ.3,500, పసుపునకు రూ.15 వేలు గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు.

ఈ నెల 7న మామిడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టి, ప్రభుత్వానికి 11 వరకు అల్టీమేటం ఇచ్చారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు ఆర్మూర్ మండలం పెర్కిట్ మహిళా ప్రాంగణం వద్ద, జక్రాన్‌పల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

రోడ్డు మీదు వంటలు చేసుకుని అక్కడే భోజనం చేసి, రాత్రికి అక్కడే నిద్రించారు. అయితే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పలు పార్టీల నేతలతో పాటు రైతులను పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తమ వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.