భూ వివాదం ఓ రైతు దారుణ హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన సిరిసిల్లాలో జరిగింది. సిరిసిల్ల రూరల్‌ సీఐ సర్వర్‌ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బందనకల్‌కు చెందిన కస్తూరి కరుణాకర్‌ రెడ్డి (40)కి వరుసకు బావ అయిన చిన్నరాములు మధ్య పదిహేనేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. 

వీరిద్దరి పొలాల మధ్య దారి  విషయంలో పంచాయితీలు జరిగాయి. అయితే గత ఏడాది కాలంగా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలూ లేవు. దీంతో అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో ఆదివారం  కరుణాకర్‌రెడ్డి తన పొలంలో పనిచేస్తుండగా చిన్నరాములు, అతని కొడుకులు వెంకటేశ్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి అక్కడికి వచ్చారు.

పొలం ఒడ్డు చెక్కవద్దని కరుణాకర్‌రెడ్డితో గొడవ పడ్డారు. గొడవ ముదిరి గొడ్డలి, పారలతో దాడి చేసి అతన్ని హతమార్చారు. ఇది గమనించిన మృతుడి సోదరి పద్మ కేకలు వేస్తూ అక్కడికి చేరుకోగా ఆమెను చంపుతామని బెదిరించి, పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ సర్వర్, ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. కరుణాకర్‌రెడ్డికి కుమారుడు పవన్‌రెడ్డి ఉన్నాడు. 

తన భర్తను హత్య చేసిన చిన్నరాములు, అతని కుమారులను కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య రేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్యలో తండ్రీకుమారులతోపాటు మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.