మూలుగుతున్న నక్కమీద తాటికాయ పడ్డ చందంగా కరోనా వచ్చి కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవ్వగా.. ఇదే అదునుగా వాళ్లింట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన నాగ వంశీకి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆయనను గాంధీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకి, వంశీ కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో క్వారంటైన్ ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే , దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు.

ఇంట్లో ఉన్న రూ.30 వేలు, 10 తులాల బంగారం అపహరించారు. వీటితో పాటు మూడు ట్యాబ్‌లు, విలువైన గడియారాలు దోచుకెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో వారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాధితుల ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.