Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ చెక్‌పోస్ట్‌లతో దందా, ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు .. వెలుగులోకి నకిలీ డీఎస్పీ లీలలు

నిజామాబాద్‌లో నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేయడంతో పాటు ప్రైవేట్ చెక్‌పోస్ట్‌లు పెట్టి ఇసుక లారీల నుంచి భారీగా దండుకున్నాడు.

fake dsp arrested in nizamabad
Author
Nizamabad, First Published Jul 17, 2021, 8:44 PM IST

ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు.. ఏకంగా డీఎస్పీగా చెలామణి అవుతున్నాడు. యూనిఫాం, పోలీస్ గుర్తింపు కార్డుతో దర్జాగా బతికేస్తున్నాడు. పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ పాస్‌బుక్‌లు, సెటిల్‌మెంట్లు చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం తుజల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ నకిలీ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది. 

నెల్లూరు స్వామి అనే కేటుగాడు డీఎస్పీ ముసుగులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశాడు. కామారెడ్డి జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో అంతా మనవాళ్లేనంటూ నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గాలం వేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. తన గ్రామంలో కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ 20 మంది నిరుద్యోగులను మోసం చేశాడు. ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 

అర్థరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి పది మందిని వెంటేసుకుని బీబీపేట, తుజల్ పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకుని పోలీసు విధులు నిర్వహిస్తున్నాడు. వసూళ్లకు సైతం పాల్పడుతున్నాడు. తుజల్ పూర్‌లోని కూడెళ్లి వాగు నుంచి వెళ్లే ఇసుక లారీలు, టిప్పర్లను టార్గెట్‌గా చేసుకుని డీఎస్పీనంటూ వసూళ్లకు పాల్పడేవాడు స్వామి. నకిలీ పాస్ బుక్‌లు తయారు చేయించి ఇవ్వడం హౌజింగ్ లోన్స్, పాస్‌బుక్‌లపై లోన్లు ఇప్పించడం స్వామికి నిత్యకృత్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వామికి స్ధానికంగా వుండే ఓ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు వున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సుమారు ఒక ఏడాది పాటు ఇతని నకిలీ పోలీస్ ఉద్యోగం సజావుగా సాగింది. 

స్వామిపై అనుమానం వచ్చిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. విచారణలో స్వామి పోలీస్ కాదని తేలింది. దీంతో నకిలీ డీఎస్పీ నెల్లూరు స్వామిని పట్టుకునేందుకు బేగంబజార్ పోలీసులు మూడు రోజులుగా బీబీపేటలోనే మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో స్వామిని ఇంటి వద్దే పట్టుకున్నారు. ఇంటర్ కూడా పాస్ కాని ఓ వ్యక్తి ఇన్ని రోజులు పోలీస్‌గా చెలమణి అవుతుంటే పోలీసులు ఇన్నిరోజులు ఏం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులు సైతం అతనితో పార్టీలకు వెళ్లారన్న ఆరోపణలు వున్నాయి. దీంతో అతడికి స్థానిక పోలీసుల అండదండలు సైతం వున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios