హైదరాబాద్: సభ్యత్వ నమోదు విషయంలో కొన్ని నియోజకవర్గాలు వెనుకబడి ఉండడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తెలంగాణ భవన్ లో  పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ విషయమై ఆయన పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏఏ నియోజకవర్గాల్లో  సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో వెనుకబడిన నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఆయన చర్చించారు. 

ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,పార్టీ నేతలకు సమావేశం నుండే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు.సభ్యత్వ నమోదులో ఎందుకు వెనుకబడాల్సి వచ్చిందనే విషయమై ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను అడిగారు.మరో వారం రోజుల పాటు  సభ్యత్వ నమోదుకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. ఈ సమయంలో నిర్ధేశించిన సభ్యత్వాన్ని చేరుకోవాలని ఆయన ఆదేశించారు.

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలు కేంద్రీకరించారు.కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో టాప్ లో ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.