తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి వినయ్  కుమార్ సింగ్ పంజాబ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనట్లు సమాచారం. పంజాబ్‌లో జైళ్ల శాఖ అభివృద్ధి, జైళ్లను ఆధునికీకరించేందుకు ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జూలై 7న విడుదలవ్వగా.. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.

 ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వీకే సింగ్‌.. అంతకు ముందు జైళ్లశాఖ డీజీగా పలు సంస్కరణలకు నాంది పలికారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎ్‌సపీఏ) డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వం తనకు పదోన్నతి ఇవ్వడం లేదనే కారణంతో కేంద్రానికి స్వచ్ఛంద పదవీ విరమణ లేఖ రాశారు. 

తెలంగాణ సర్కారుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌స్ గా తీసుకుంది. ఆయనను పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ పదవీ నుంచి తప్పించింది. ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండానే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ని ఆయన వినియోగించుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే.. తాను తెలంగాణ వీడి ఎక్కడికి వెళ్లనని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. పంజాబ్ ప్రభుత్వం తనకు ఆఫర్ ఇచ్చిన విషయం నిజమేనని.. తాను జైళ్ల శాఖలో చేసిన పని తీరు గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు. అయితే తాను తెలంగాణకు చేయాల్సింది చాలా ఉందని.. అందుకే ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు.