హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సీఎల్పీ విలీనం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అదిరించో, బెదిరించో, ఒప్పించో, ఒత్తిడి పెట్టో టీఆర్ఎస్ లొంగదీసుకుందని ఆరోపించారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లొంగదీసుకోవడం ప్రజలను మోసం చేసినట్టేనన్నారు. 

అప్రజాస్వామిక విలువలను ప్రోత్సహించినట్లేనని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంత తప్పో, పార్టీ మారిన ఎమ్మెల్యేలది కూడా అంతే తప్పని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

తనను ఎదుర్కొనలేకే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని లొంగదీసుకోవడం బాధాకరమన్నారు. ప్రజల కోసం, టీఆర్ఎస్ పార్టీ అనైతిక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలపక్షాన నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఎప్పటికీ తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఎవరు ఎటుపోయినా తాను మాత్రం చేవేళ్ల ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు మాజీ ఎంపీ  కొండావిశ్వేశ్శర్ రెడ్డి.